తండ్రి సూపర్‌స్టార్.. కొడుక్కి మాత్రం 15 ఏళ్ళలో ఒకే ఒక హిట్!
on Dec 21, 2023
బాలీవుడ్‌లో వారసత్వం ఎంతగా ఉంటుందో అందరికీ తెలిసిందే. పాతతరం నుంచి ఇప్పటివరకు ఎంతో మంది హీరోల తనయులు, మనవళ్ళు హీరోలుగా పరిచయమయ్యారు. కొందరు అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ సాధిస్తే మరికొందరు కొన్ని సినిమాలకే పరిమితమై కనుమరుగైపోయారు. విషయానికి వస్తే.. బాలీవుడ్ హీరోల్లో మిథున్ చక్రవర్తికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. 80, 90 దశకాల్లో తన స్టెప్పులతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన మిథున్ లెక్కకు మించిన సినిమాల్లో హీరోగా నటించాడు. అతని నటనకంటే డాన్సులతోనే ఆడియన్స్‌ను మెప్పించాడు. మిథున్ తర్వాత అతని తనయుడు కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముందుకొచ్చాడు. అయితే తండ్రిలా కొడుకు సక్సెస్ అందుకోలేకపోయాడు. అతనే మహాక్షయ్ చక్రవర్తి. బాలీవుడ్ ఆడియెన్స్ అతన్ని మిమో చక్రవర్తి అని పిలుస్తుంటారు. మిమో తల్లి యోగితా బాలి కూడా పలు సినిమాలో హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. మిమో తల్లిదండ్రులు తమ కెరీర్‌లో సూపర్ సక్సెస్ అందుకున్నారు.
2008లో మిమో చక్రవర్తి ‘జిమ్మి’ చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేశారు. మొదటి సినిమాయే డిజాస్టర్‌గా నిలిచింది. తొలి సినిమాలో ‘మిమో’ అనే పాత్రలో నటించారు. అందుకే ఆయనను మిమో చక్రవర్తి అని పిలుస్తుంటారు. 1974లో అమితాబ్ బచ్చన్ నటించిన ‘మజ్బూర్’ చిత్రానికి రీమేక్‌గా ‘జిమ్మి’ రిలీజ్ అయింది. ఆ తర్వాత 2011లో వచ్చిన ‘హంటెడ్’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు మిమో. అప్పటి నుంచి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. హీరోగానే కాకుండా, కీలక పాత్రల్లో కూడా నటిస్తున్నాడు. కానీ, ఇప్పటివరకు అతనికి మరో హిట్ లేదు. ఇప్పటికీ యాక్టివ్‌గానే ఉన్న మిమో ఇకనైనా సూపర్‌హిట్ అందుకుంటాడని మిథున్ అభిమానులు ఆశిస్తున్నారు.